పుడమిపై ప్రభవించే జీవజాలమంతా ఆ భగవానుని చిద్విలాసమే. జీవులందరితో మానవ జన్మ మహోత్కృష్టమైనదను విషయం సర్వవిదితం. అయినా మానవులందరూ మహోన్నతులు కాజాలరు. కొందరు మాత్రమే అసదృశస్థాయికి ఎదుగుదురు. భారతమాత ఒడిలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన వేదోద్ధారులు, తాత్వికులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు, సచ్చిదానందస్వరుపులు ఎందరో ఉద్భవించారు. ప్రపంచానికి తమ తమ పరిమళాన్ని వెదజల్లి తమ తల్లిని హిమోత్తుంగశిఖరాగ్రాలకు చేర్చారు. అట్టివారిలో ధన్యచరిత, మాన్య, సౌమ్యమూర్తి, సుగుణశీల, గంభీర మృదు మధుర స్వభావిని కీ.శే. డా. కళాప్రపూర్ణ ఊటుకూరి లక్ష్మీ కాన్తమ్మ ఒకరు.
పువ్వు పుట్టగానే తన తావులను విరజిమ్ముసర్వులను ఆనంద పరవశులను చేసినట్లే లక్ష్మీకాన్తమ్మ కూడా చిన్ననాటి నుండే అసమాన ప్రజ్ఞాపాటవాలతో ఎదుటి వారిని సమ్మోహపరచింది. రాజమహేంద్రవర వాసులైన “మధురకవి” కీ.శే. నాళము కృష్ణారావు, సుశీలమ్మల గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించింది. తనువు చాలించే వరకు తన ప్రజ్ఞా పుష్ప సౌరభాలను నేల నలుచెరగులా వెదజల్లిన అనర్ఘ రత్నం. సంగీత, సాహిత్యాది లలిత కళా ప్రావీణ్యం, సమాజ సేవా తత్పరత, ఉత్తమా ఇల్లాలిగా మహోన్నత చారిత్రగా వెలుగొందిన వైనం వెల కట్టలేనిది.