పుడమిపై ప్రభవించే జీవజాలమంతా ఆ భగవానుని చిద్విలాసమే. జీవులందరితో మానవ జన్మ మహోత్కృష్టమైనదను విషయం సర్వవిదితం. అయినా మానవులందరూ మహోన్నతులు కాజాలరు. కొందరు మాత్రమే అసదృశస్థాయికి ఎదుగుదురు. భారతమాత ఒడిలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన వేదోద్ధారులు, తాత్వికులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు, సచ్చిదానందస్వరుపులు ఎందరో ఉద్భవించారు. ప్రపంచానికి తమ తమ పరిమళాన్ని వెదజల్లి తమ తల్లిని హిమోత్తుంగశిఖరాగ్రాలకు చేర్చారు. అట్టివారిలో ధన్యచరిత, మాన్య, సౌమ్యమూర్తి, సుగుణశీల, గంభీర మృదు మధుర స్వభావిని కీ.శే. డా. కళాప్రపూర్ణ ఊటుకూరి లక్ష్మీ కాన్తమ్మ ఒకరు. పువ్వు పుట్టగానే తన తావులను విరజిమ్ముసర్వులను ఆనంద పరవశులను చేసినట్లే లక్ష్మీకాన్తమ్మ కూడా చిన్ననాటి నుండే అసమాన ప్రజ్ఞాపాటవాలతో ఎదుటి వారిని సమ్మోహపరచింది. రాజమహేంద్రవర వాసులైన “మధురకవి” కీ.శే. నాళము కృష్ణారావు, సుశీలమ్మల గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించింది. తనువు చాలించే వరకు తన ప్రజ్ఞా పుష్ప సౌరభాలను నేల నలుచెరగులా వెదజల్లిన అనర్ఘ రత్నం. సంగీత, సాహిత్యాది లలిత కళా ప్రావీణ్యం, సమాజ సేవా తత్పరత, ఉత్తమా ఇల్లాలిగా మహోన్నత చారిత్రగా వెలుగొందిన వైనం వెల కట్టలేనిది.
తన సంతానమైన మమ్మల్ని ఉత్తములుగా తీర్చిదిద్దిన తుల లేని మాతృమూర్తి. తల్లిదండ్రుల మధురకవి తావైభవం, దేశభక్తి, సమాజ సేవా తత్పరతలు ఆమెను ప్రభావితం చేశాయి. తన ఎనిమిదవ ఏటనే అనర్గళంగా ఉపన్యసించి ఉపన్యాస కేసరి శ్రీ చెరకువాడ వారినే అబ్బుర పరచిన ఆమె భాషణం ఆమెకు దైవదత్తమైన వరం. చిన్నవాడే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ధీరురాలు. తన పధ్ధెనిమిదవ ఏటనే రాజమహేంద్రవరంలోని ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర యువతీ సంస్కృతి కళాశాల నుండి ఉభయభాషా ప్రవీణ, పట్టపరీక్షలో ప్రధమురాలిగా నెగ్గిన యువతి. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నుండి సర్ణ పతకాన్ని పొందిన విదుషీమణి. నాటి నుండి ఆమె జీవితంలో ముందడుగే కాని వెనుకడుగు లేదు.
నుదట కాసంత కుంకుమ బొట్టు, మేలైన పొందూరు, కాంచీపురం చీరలు, నిరాడంబరమైన ఆభరణధారణం ఆమెకు మరింత వన్నె తెచ్చాయి. మైకులు లేని కాలంలోనే తన అనర్గళ వాగ్ధారలను పంచి శ్రోతలను ఆనందాబ్ధిలో ఓలలాడించిన ఉపన్యాస కేసరి. తన వీణావాదన మాధుర్యాన్ని అనేక శిష్యులకు పంచిన సంగీత సామ్రాజ్ఞి. సంతాన హీనులకు వైద్యం చేసి ఎందరో మాతృమూర్తులకు సంతాన ప్రాప్తిని కలుగచేసిన చికిత్సకురాలు.
లక్ష్మీ కాన్తమ్మ హయగ్రీవగుప్త దంపతులు
భగవద్గీతోపాసన చేసి ఆ గీతామృతాన్ని తాను ఆస్వాదించి ఆ అమృత ధారలను ఆంధ్రా వనిత పంచిన గీతోపదేశికురాలు. చిన్ననాటి నుండే ఆమెను అనేక బిరుదులు వరించాయి. “తెలుగుమొలక”, “ఆంధ్రసరస్వతి”, ధర్మ ప్రచార భారతి", "సంగీత సామ్రాజ్య సరస్వతి", "సాహితీ రుద్రమ”ఈ బిరుదునే తన స్వీయ చరిత్రకు మకుటంగా పెట్టారు. "బ్రాహ్మీభూషణి”, “అపర వాగ్దేవి” మొదలైన బిరుదులు ఆమెకు సార్థకతను చేకూర్చాయి.
ఆమె రచనా వ్యాసంగం 1953 సం॥లో తెలుగు భాషా సమితి” (మద్రాసు) వారి పోటీతో పాల్గొని ఆంధ్ర కవయిత్రుల చరిత్రను వ్రాసి ప్రథమ బహుమతిని పొందింది. “గృహలక్ష్మి” సంపాదకులు మాన్యశ్రీ కేసరి గారిచే స్వర్ణకంకణాన్ని పొందిన ప్రజ్ఞాశాలిని. తన పితౄణాన్ని చాటుకుంటూ ఆ గ్రంధాన్ని తన మాతాపితరులకే అంకితం చేసిన ఆదర్శ దుహిత. అంతే కాదు రచనా వ్యాసంగాన్ని నిర్లక్ష్యం చేయక ఆంధ్రుల కీర్తన వాఙ్మయి సేవను గ్రంథస్తం చేసింది.
కేంద్ర-సాహిత్య అకాడమీ ఆధ్వర్యాన ‘అఖిల భారత కవయిత్రుల”ను వెలుగులోకి తెచ్చిన విదుషీమణి. పరిశోధనా గ్రంధాలే కాదు. భావుకత, కాల్పనికత, ధీపటిమ, కల్గిన గేయ కావ్యాలు "కాంతి శిఖరాలు”, “లజ్జాకిరీటధారిణి” మొదలగు కావ్యాలను. వ్యంగ్య వాసనా విలసితమైన “కన్యకమ్మ నివాళి” మహాత్మాజీ పాదపుష్పంగా వెలిసిన “ఒక్క చిన్న దివ్వె, ఆంధ్రప్రదేశ్వారి సత్కారాన్ని పొందిన అత్యంత మధురాతి మధురమైన “నా తెలుగు మాంచాల” గేయ కావ్యాన్ని, మనోహర దృశ్యరూపకం " సరస్వతీ సామ్రాజ్య వైభవం" కావ్యాన్ని, సంస్కృత భాషలో ఆశువుగా రచించిన 'శ్రీమత్కన్యకా సుప్రభాతం”, “దేవీస్తవతారావళి”, “జాతిపిత” కావ్యాలను అలవోకగా రచించిన కవితా శిరోమణి. కవయిత్రులలో తొలుదాత్తగా రచించిన “సాహితీరుద్రమ” (స్వీయచరిత్ర), అనేక కథలు, ఒకటేమిటి ఎన్నో కావ్యాలను రచించి గణుతికెక్కిన ప్రోఢ. కళాభినేత్రిగా వాసికెక్కింది. పుష్పాభిషేకాలు, గజారోహణం, తంజావూరు నాయక రాజుల ఆస్థాన కవయిత్రి రంగాజీ తర్వాత మళ్లీ కనకాభిషేక సమ్మానాన్ని పొందిన (అనంతపురం లలిత కళాసమితి వారిచే) కనకాభిషిక్త. అతులిత ప్రతిభాశాలిని. అసమాన పాండితీప్రకర్షను చూపి అతివలందరికీ ఆదర్శప్రాయమైన ఆంధ్రమహిళ. ధన్యజీవి.
స్త్రీకి గాని, పురుషునికి గాని సహచరుల అండ లేకపోతే అందం రాదనే సూక్తికి నిదర్శనంగా నిలచిన వనితామణి లక్ష్మీకాన్తమ్మ. పత్ని ప్రగతిని, పురోభివృద్ధిని మనసారా అభినందించి ఆమెకు చేయుత నిచ్చి భారతమాత కిరీటంలో కలికితురాయిగా నిల్పిన నాపితృపాదులు కీ.శే. ఊటుకూరి హయగ్రీవగుప్త (అడ్బకేట్) గారు చిరస్మరణీయులు. భారతదేశంలోనే కాదు పశ్చిమ జర్మనీ మొదలగు కమ్యూనిష్టు దేశాలలో, కేంద్ర సాహిత్య ఎకాడమీ తరపున దేశ పర్యటన చేసి భరతమాత ఖ్యాతిని ఇనుమడింప చేసిన ఏకైక భారత వనిత. ప్రపంచ తెలుగు మహా సభలలో పొల్గొని తన మాతృ భాషా వైభవాన్ని అజరామజరం చేసిన ఆంధ్ర వనిత. పుట్టినింటి వారు. మెట్టినింటి వారు మెచ్చి అభినందించిన మహిళా శిరోమణి లక్ష్మీకాన్తమ్మ. జీవించినన్నాళు రాజహంసలా 79 సం॥లు జీవించి స్వల్ప కాలం అనారోగ్యం పాలై దివికేగి భగవంతుని సన్నిధానాన్ని చేరుకున్న చిరయశస్విని. పుట్టుక గిట్టుట కొరకేగదా ! ఆమె మరణవార్తను ఆలకించిన అశేష ఆంధ్ర ప్రజలు ఆమెకు అశ్రు తర్పణం వదిలారు.